ఎపిసోడ్ – 01 :- ( కాలక్షేపం)
కాలక్షేపం అంటే సమయాన్ని సరదాగా గడపడం, వినోదించడం. అది కుటుంబంతో అయితే మనసుకి మరింత ఆనందం, ప్రశాంతత..
ఇలాంటి క్షణాలే వాళ్ళతో మనకుండే జ్ఞాపకాలు కూడా..
రోజు మొత్తంలో మనకోసం మనకు ఎంతో కొంత కాలక్షేపం చేసుకోవడం చాలా అవసరం. ఈ కాలక్షేపం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రోజువారీ ఒత్తిడి నుండి అలాగే రోజువారి పనుల నుండి విముక్తి పొందాలంటే కాలక్షేపమే సరైన మార్గం.
కానీ ఒకప్పుడు కాలక్షేపం మరియు ఇప్పటి కాలక్షేపానికి చాలా తేడా ఉంది. టెక్నాలజీ పరంగా మాత్రమే అనుకుంటే పొరపాటే.. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి దీనికి..
అది ఎవరితో కలవలేకపోవడం వలన కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకోవడం కూడా కావచ్చు.
మరో రకంగా కాలక్షేపం చేయడం వలెనేమో ఈరోజుల్లో దాని అర్ధమే మారిపోయింది..!
వృద్ధుల కాలక్షేపం :-
ఒకప్పుడు అంటే మన అమ్మమ్మలా కాలంలో అంతెందుకు మన చిన్నతనంలో కూడా మనకు అనుభవం జరిగి ఉంటుంది.
మన నానమ్మ లేదా అమ్మమ్మలా కాలక్షేపం చాలా సరదాగా, ఆనందంగా ఉండేది. ఇంట్లో పని అవ్వగానే బయటకు వెళ్లి ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే సమయం తక్కువ..
ఎవరికైనా ఏదైనా వ్యాపకం ఉంటే ఇతరులు వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. ఏదైనా ఇంటిముందు చూస్తే ఐదు, ఆరుగురు గుమిగుడి ఎన్నో మాటలతో, వ్యాపకాలతో కనిపించే వారు..
అప్పట్లో వాళ్ళు ప్రకృతికి కూడా దగ్గరగా ఉండేవారు.. ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి తోటకెళ్లడం లాంటివి చేసేవారు.
అప్పట్లో ఇలాంటి నానమ్మల్ని చూసి సీసీ కెమెరా అంటూ సరదాగా జోకులు కూడా వచ్చేవి.. ఏ ఇంట్లో ఏదీ జరిగిన వీళ్ళు కాప్చర్ చేసేవాళ్ళు మరి.. వయసు చాదస్తమో లేకపోతే ఆ కాలం ప్రభావం వలనో తెలియదు కానీ పక్కింట్లో ఎం జరుగుతుందో అని తెలుసుకోవాలన్నా ఆరాటం వీళ్ళకి పుష్కళంగా ఉండేది.
సామాజిక బంధాలకి దూరం అవ్వడం వలెనేమో లేకపోతే వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడం వలెనేమో కానీ ఈరోజుల్లో అలాంటి నాన్నమ్మలు వీధికి ఒక్కరూ కూడా కనిపించడం లేదు.
ప్రస్తుతం అయితే నిజంగా ఇలాంటి నానమ్మలని మిస్ అవుతున్నామనే చెప్పాలి.
ప్రస్తుతరోజుల్లో ఇలాంటివి దూరం అయ్యాయి.. టెక్నాలజీ పరిచయం అయింది. ఉమ్మడి కుటుంబం అనేది ఈరోజుల్లో చాలా తక్కువ కాబట్టి వీడియో కాల్స్ చేస్తూ పిల్లలతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. టెక్నాలజీ తో కలిసి వీళ్ళు ముందుకు అడుగులు వేస్తున్న కానీ ప్రకృతి కి, సామాజిక బంధాలకి అయితే దూరంగా ఉంటున్నారనే చెప్పాలి.
ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గడంతో పిల్లల్లా పిల్లలతో ఆడుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళకి..
ఆడవాళ్ళ కాలక్షేపం :-
ఒకప్పుడు సాయంత్రం అవ్వగానే ఆడవాళ్లంతా తమ ఇంట్లో పని పూర్తి చేసుకొని ఒకటే దగ్గర కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళు.. సరదాగా గడిపే వాళ్ళు.. కలిసి కూరగాయలు తరుక్కోవడం లాంటివి కూడా చేసుకునే వాళ్ళు.. పేరుకి ఇరుగు పొరుగు అయినప్పటికీ ఒకరికి మరొకరు కష్టసమయాల్లో తోడుగా ఉండేవారు.
ఇలా చేయడం వలన సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి.
నిజమే మరి..! అప్పట్లో పక్కింటి వాళ్ళు కూడా బంధువులాగా ఉండేవారు కానీ ఇప్పుడు బంధువులు కనీసం పరిచయస్తులా కూడా ఉండట్లేదు..
ఇక పక్కింటి వాళ్ళతో సానిహిత్యం కూడా తక్కువే అని చెప్పాలి ప్రస్తుతరోజుల్లో..
ఈరోజుల్లో టీవీ సీరియల్స్ ప్రభావం వలన మరియు కొంతమంది ఆడవాళ్ళూ ఉద్యోగాలకి వెళ్లడం వలన ఇలాంటి కాలక్షేపాన్ని కోల్పోతున్నారు.
మగవాళ్ల కాలక్షేపం :-
ఇంకా ఇంట్లో మగవాళ్ళు అయితే బయటకు వెళ్తే ఇంటికి రావడం కష్టం.
ఇప్పుడు అంటే క్రికెట్ బెట్టింగ్ లు, వాకింగ్, జిమ్ లు అంటూ పెరిగిపోయి ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా అయ్యారు కానీ అప్పట్లో అయితే వాళ్ళకంటూ ప్రత్యేక చోటు ఉండేది కలిసి మాట్లాడుకోవడానికి..
అప్పట్లో ప్రతి ఊరిలో చాయ్ కొట్టుకి ఉన్న ప్రత్యేకత ఇప్పట్లో రెస్టారెంట్ కి తక్కువే..!
ఎక్కువగా అక్కడే కలిసి మాట్లాడుకునేవారు.. లేకపోతే ఏదైనా చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా గడిపేవాళ్ళు.
పిల్లల కాలక్షేపం :-
ఇక పిల్లల విషయానికి వస్తే అందరు కూడా ఒకటే దగ్గర చేరి ఎన్నో ఆటలు ఆడేవారు. ఎప్పుడో ఉదయం బయటకు వెళ్తే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకునే వాళ్ళు.
ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం అనే మాట పక్కన పెడితె కనీసం తోబుట్టువులతో కలసి ఆడుకోవడమే గగనం అయిపొయింది.
ఫోన్, టీవీ, ట్యాబ్, లాప్టాప్,వీడియో గేమ్స్ అంటూ ఇన్ని సదుపాయాలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కాలక్షేపంగా మారడంతో మనిషి, మనిషితో కలిసి మాట్లాడటమే కనుమరుగైపోయింది.
అవసరాల కోసం తప్ప బయటకు వెళ్లడం పూర్తిగా తగ్గించేసారు ఇంట్లోనే అన్నీ సదుపాయాలు ఉండటంతో..
ఆధునిక ప్రపంచంలో మనం కూడా వాటితో పాటు ముందుకు అడుగులు వేస్తూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం బాగుంది కానీ ఈ సావాసం మాత్రం సమస్యలు తెచ్చి పెట్టి విధంగా ఉండకూడదు.
టెక్నాలజీ తో పరిచయం ఉంటే బాగుంటుంది కానీ సానిహిత్యం అంతా మంచిది కాదు. మనకే తెలీకుండా వాటికీ బానిస అవుతాం కాబట్టి ఇప్పుడే పిల్లల్లకి వాటిని మరి ఎక్కువగా అలవాటు చేయకూడదు..
నలుగురితో ఉండటం, హుషారుగా అందరితో కలవడం లాంటివి అలవాటు చేయాలి లేకపోతే ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకునే అవకాశం ఉంది భవిష్యత్ లో..
కుటుంబ కాలక్షేపం :-
అప్పట్లో కుటుంబం విషయానికి వస్తే అందరు కూడా ఒకటే దగ్గర కూర్చొనేవారు. అది టీవీ ముందు అయినా లేకపోతే ఇంటిముందు వరండాలో అయినా..
సాయంత్రం నుండి రాత్రి వరకు ఉండే ఈ సమయం కుటుంబానికి చాలా విలువైంది. అందరు ఇంటికి చేరి ఆరోజు తమకి ఎదురైనవి అలాగే తాము తెలుసుకున్నవన్ని కూడా..
ఈరోజు ఎం జరిగిందో తెల్సా..! అంటూ ప్రతి ఒక్కరు కూడా తమ తమ కుటుంబంతో పంచుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు..
టీవీ చూసిన అందరు కలిసి చూసేవాళ్ళు.. భోజనం చేసిన అందరు కలిసి చేసేవాళ్ళు. భోజనం చేసేటప్పుడు సరదా మాటల గురించి తప్ప సమస్యల గురించి చర్చ నడిచేది కాదు..
బహుశా అందుకేనేమో అప్పట్లో కుటుంబ భాంధవ్యాలు అంత బలంగా ఉండేవి.
ఇప్పుడు ఎవరి పనుల్లో నుండి వారు ఇంటికి వచ్చిన కూడా కలిసి మాట్లాడుకోవడమే కనిపించడం లేదు. పేరుకే కుటుంబంలో నలుగురు మనుషుల మధ్య ఉన్నట్టు కానీ కనీసం నాలుగు మాటలు కూడా ఉండవు వాళ్ళ మధ్య..
ఎవరి తీరిక లేని పనుల్లో వాళ్ళు బిజీ.. అందరు ఒక్కచోట ఉన్న కూడా చేతుల్లో ఫోన్.. అందుకే నోరుకి పని చెప్పడం తక్కువ అయింది..
కుటుంబంలో ఇలా ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉండటం వలన టీవీకి కూడా విశ్రాంతి దొరికింది, కలిసి చూడటం అనే మాటకి కూడా..!
ఈ ఊరుకులు పరుగుల జీవితంలో కలిసి భోజనం చేయడం ఏ పండుగల సమయంలో లేకపోతే శుభకార్యాలలోనే సాధ్యం అవుతుంది.
ముగింపు :-
ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేలా కాలక్షేపం ఉన్నకాని ఇప్పుడు మాత్రం అన్నింటిలో ముందు ఉండేలా ఉంది. తెలియని కొత్తవాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది.
కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే అప్పట్లో అలా ఉండటమే మంచిది అయింది. అప్పట్లో టెక్నాలజీ లేకపోవడం కూడా..
అలాంటి కాలక్షేపం చూస్తు పెరగడం వలెనేమో ఇప్పుడు మనకు కుటుంబ నైతికత, బంధాల విలువ గురించి తెలిసింది. భవిష్యత్ తరాలకి మాత్రం ఇలా చూసి నేర్చుకునే అవకాశం, అనుభవించే అవకాశం మాత్రం చాలా తక్కువ.
ఎంత టెక్నాలజీ పరంగా అన్నీ అభివృద్ధి చెందుతున్న కానీ పూర్వికుల అనుభవానికి మించి ఉండదు. వాళ్ళ నుండి ఎంతో కొంతో నేర్చుకుంటూ వర్తమానాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి.